ఫలించిన బండి సంజయ్ క్రుషి
కరీంనగర్ ను వేధిస్తున్న ‘డంప్ యార్డ్’ సమస్యకు తెరపడే అవకాశం
తెలంగాణకు దక్కాల్సిన వాటాకంటే అధిక ఇండ్లు మంజూరుకు కేంద్రం హామీ
కరీంనగర్ పర్యటన ఏర్పాట్లపట్ల కేంద్ర మంత్రి ఫిదా
శభాష్ బండి సంజయ్ అంటూ… అభినందనలు
మనోహర్ లాల్ కట్టర్ పర్యటన దిగ్విజయవంతం
రాజకీయాలకు అతీతంగా అందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చిన బండి
రాజకీయాలకంటే తమకు కరీంనగర్ అభివ్రుద్దే లక్ష్యమని ప్రకటించిన ముగ్గురు నేతలు
కరీంనగర్ రాజకీయాలు రాష్ట్రానికి ఆదర్శం కావాలని కోరుతున్న నేతలు
తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ క్రుషి ఫలించింది. కరీంనగర్ ప్రజలను ఏళ్ల తరబడి వేధిస్తున్న ‘డంపింగ్ యార్డ్ ’ సమస్యకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ పర్యటనతో ఎట్టకేలకు పరిష్కారం లభించేలా చేయడంలో సంజయ్ విజయవంతమయ్యారు. డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరిస్తానని, అందుకు ఎంత ఖర్చయినా కేంద్రమే భరిస్తుందని బహిరంగ సభ వేదికగా కేంద్ర మంత్రి హామీ ఇవ్వడంతో కరీంనగర్ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బండి సంజయ్ చేసిన క్రుషి వల్లే ఇది సాధ్యమైందని రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు, ప్రజలు చర్చించుకోవడం గమనార్హం.
మరోవైపు కేంద్ర హౌజింగ్ మంత్రిగా ఉన్న కట్టర్ కరీంనగర్ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి అధిక సంఖ్యలో ఇండ్లు కేటాయిస్తామని ప్రకటించడం మరో సానుకూల పరిణామం. ‘‘ఈ ఏడాది కోటి ఇండ్లను దేశవ్యాప్తంగా నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. అందులో తెలంగాణకు రావాల్సిన వాటా కంటే అధికంగా కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నాం’’అని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి చేసిన తాజా ప్రకటన రాష్ట్రంలో ఇండ్లులేని పేదల పాలిట వరంగా మారనుంది. కట్టర్ హామీపట్ల రాష్ట్ర రెవిన్యూ, గ్రుహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరో మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం సంతోషం వ్యక్తం చేశారు. ‘‘గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్లను నిర్మించకుండా పేదల పొట్టకొట్టింది. నిలువ నీడ లేకుండా చేసింది. ఫలితంగా రాష్ట్రంలో 65 లక్షల కుటుంబాలకు పైగా ఇండ్లు కావాలని ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్నారు. కేంద్రం అధికంగా ఇండ్లను మంజూరు చేస్తే పేదలకు గూడు లభిస్తుంది’’అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కరీంనగర్ బహిరంగ సభా వేదికగా పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ను కరీంనగర్ తీసుకురావడంలో, హామీలు ఇప్పించడంలో స్థానిక ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కరీంనగర్ లో ఏళ్ల తరబడి వేధిస్తున్న‘‘ డంపింగ్ యార్డ్’’ సమస్యకు ఎట్లాగైనా పరిష్కరించాలని కంకణం కట్టుకున్న బండి సంజయ్ కుమార్ కొద్దిరోజుల క్రితమే ఈ విషయాన్ని మనోహర్ లాల్ కట్టర్ ద్రుష్టికి తీసుకెళ్లారు. కరీంనగర్ డంపింగ్ యార్డ్ ద్వారా దాదాపు 10 డివిజన్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, అనేక రోగాలతో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించడం ద్వారా కరీంనగర్ ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. బండి వినతిపట్ల ఆనాడే మనోహర్ లాల్ కట్టర్ సానుకూలంగా స్పందించారు. తాజాగా నేడు కరీంనగర్ బహిరంగ సభా వేదికగా ‘డంప్ యార్డ్’ సమస్యను పరిష్కరిస్తామని, అందుకు ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధమని హామీ ఇవ్వడంతో బీజేపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంకోవైపు కరీంనగర్ అభివ్రుద్ది విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా సంజయ్ తో కలిసిరావడం కరీంనగర్ ప్రజలతోపాటు రాష్ట్ర రాజకీయాల్లోనే చర్చనీయాంశమైంది. జెండా, ఎజెండాలు వేరైనా కరీంనగర్ అభివ్రుద్ధి విషయంలో తమది ఒకే మాట అని, కరీంనగర్ అభివ్రుద్ధే తమకు ప్రధాన ఎజెండా అని ఈ సభా వేదికంగా ముగ్గురు నేతలు చెప్పడం విశేషం. రాజకీయ వైషమ్యాలను పక్కనపెట్టి ప్రజా సమస్యలపై కలిసి రావడం శుభ పరిణామమని, ఈ విషయంలో బండి సంజయ్ తీసుకున్న చొరవ అభినందనీయమని కరీంనగర్ లోని మేధావులు, విద్యావేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒక పార్టీపై ఇంకో పార్టీ నేతలు చిర్రుబుర్రులాడుతూ, కొట్లాడుకుంటున్న ఈ తరుణంలో కరీంనగర్ రాజకీయాలు ఆదర్శంగా నిలుస్తాయనడంలో సందేహం లేదని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.