రైతు భరోసా ఎకరాకు 15000 చెల్లించాలి.
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే.గీత డిమాండ్.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి జనవరి
తెలంగాణ రాష్ట్ర నూతన ప్రజా ప్రభుత్వం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన రైతు భరోసా హామీని వెంటనే అమలు చేయాలని ఎకరాకు 15000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ మండల తాసిల్దార్ కి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే.గీత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వానకాలం ముగిసి యాసంగి కాలం వచ్చిన ఇప్పటివరకు రైతులకు రైతు భరోసా చెల్లించకుండా అనేక రకాల అడ్డంకులు కల్పిస్తూ ఇచ్చిన మాట నిలుపుకోలేదని ఆమె ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.ఎన్నికలకు ముందు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ వేదికగా రాహుల్ గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అసంపూర్తిగా ఉన్నాయని ఆమె అన్నారు. కేవలం మహిళల ఫ్రీ బస్సు కల్పించి గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చెల్లించవలసిన వానాకాలం యాసంగికాలం రైతు భరోసా ఒక్కొక్క రైతుకు 30 వేల రూపాయల చొప్పున చెల్లించవలసి ఉండగా ఎకరాకు 6000 చెల్లిస్తామని నిన్న క్యాబినెట్ సమావేశాల్లో చెప్పడం రైతులను మోసం చేయడమేనని ఆమె అన్నారు. అందులో భాగంగా రైతు భరోసా కు రైతులను దరఖాస్తు చేసుకోమనడం రైతులు డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పడం రైతులను నమ్మకం లేని వ్యక్తులుగా చూడడం సరైన నిర్ణయం కాదని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో కౌలు రైతులకు 12000 ఇస్తామని ప్రకటించి ఎటువంటి నిబంధన నియమాలు చెప్పకపోవడం కేవలం ప్రకటనలు చేసి ప్రజలను పక్కదోవ పట్టించడమేనని ఆమె అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ నూతన ప్రజా ప్రభుత్వం రైతులకు ఎకరాకు 15000 రైతు భరోసా చెల్లించాలని లేదంటే రాష్ట్రవ్యాప్తంగా రైతులను ఏకం చేసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పొదిల రామయ్య మండల కమిటీ సభ్యులు సురేష్ నాగరాజు గౌడు నాయకులు మల్లికార్జున వెంకటయ్య కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.