తెలంగాణ ప్రభుత్వం రైతు పండుగ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించింది. పాలమూరు జిల్లాలో తొలి రోజు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఐతే.. సీఎం రేవంత్ రెడ్డి లేకపోవడం రైతులకు కొంత అసంతృప్తి కలిగించింది
ఐతే.. ఆయన 30వ తేదీన, పండుగ చివరి రోజు కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిసింది. ఆల్రెడీ అధికారులు ఆ ఏర్పాట్లలో ఉన్నారు. 30న సాయంత్రం 4 గంటలకు సీఎం రైతు పండుగ సదస్సు సభకు వస్తారని తెలిసింది. అందువల్ల ఆయన చేయబోయే ప్రసంగంపై రైతులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా 3 శుభవార్తల కోసం రైతులు చూస్తున్నారు.
శుభవార్త-1: 3 లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.2లక్షల చొప్పున రుణమాఫీ డబ్బును నవంబర్ 30న జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడంతో.. అదే మాటను సీఎం నోటి ద్వారా కూడా వినాలని రైతులు కోరుకుంటున్నారు. డబ్బు జమ అవ్వడం మొదలైతే.. అది నవంబర్ 30న ఉదయం నుంచే అకౌంట్లలో జమ అవుతుంది. అదే జరిగితే, సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి.. జమ చేస్తున్నట్లు చెప్పే ఛాన్స్ ఉంటుంది.
శుభవార్త-2: రైతులకు సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దాంతో రైతులు సన్న వడ్లనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు అమ్మారు. ఐతే.. వారికి ఇంకా బోనస్ డబ్బులు ఇవ్వలేదు. 30 నుంచి ఈ డబ్బులు ఇస్తారని రైతులు ఆశిస్తున్నారు. దీనిపై కూడా సీఎం నుంచి శుభవార్తను రైతులు కోరుకుంటున్నారు.
శుభవార్త-3: రైతులకు ఈ సంవత్సరం రైతు భరోసా ఇంకా ఇవ్వలేదు. ప్రతీ రైతుకీ ఎకరానికి రూ.15,000 చొప్పున ఇవ్వాల్సి ఉంది. ఈ డబ్బును 2 విడతల్లో ఇస్తారని అంటున్నారు. కనీ ఒక విడత కూడా ఇప్పటివరకూ ఇవ్వలేదని రైతులు అసంతృప్తితో ఉన్నారు. అందువల్ల ఒక విడతపై అయినా సీఎం నుంచి ప్రకటన రావాలని కోరుకుంటున్నారు.