– గుమ్మడి నర్సయ్య మాజీ ఎమ్మెల్యే
మోతే డిసెంబర్ 12 (తెలంగాణ కెరటం ) మోతే మండలం రావి పహాడ్ గ్రామంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు రావిపహాడ్ గ్రామంలో ఇథనాలు ఫ్యాక్టరీ ముందు సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ అధ్వర్యంలో చేస్తున్న ధర్నాలో అఖిలపక్ష పార్టీల నాయకులు మద్దతు తెలిపారు.ఈ సందర్బంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజాబిప్రాయ సేకరణ చేయకుండా గ్రామాలలో ఇథనాల్ ఫ్యాక్టరీలను అనుమతించడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. ఇథనాలు ఫ్యాక్టరీ ఈ గ్రామంలో నిర్మిస్తే చుట్టుపది కిలోమీటర్ల పొడవున భూమి మొత్తం ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందన్నారు. పచ్చని పంట పొలాలలో ఫ్యాక్టరీలు నిర్మించి విష వాయువులు చిందించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదన్నారు. మనుషుల ప్రాణాలను, పశుపక్షాది జీవరాశులను నాశనం చేసే హక్కు ఏ రాజ్యాంగం మీకు కల్పించిందని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే, రోజుకు 7లక్షల 50 వేల లీటర్ల నీరు ఫ్యాక్టరీ వాళ్ళు వినియోగిస్తే భూగర్భ జలాలు మొత్తం అడుగంటిపోయి పంట భూములు ఎడారులుగా మారుతాయి అన్నారు.పాలేరు జలాల మీద ఆధారపడే రైతుల పంటలు ఎండిపోతాయి అన్నారు. కంపెనీ వలన చిన్న సన్న కారు రైతులు వేసుకున్న బోరు బావులు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. పంటలు పండక గ్రామీణ ప్రజానీకం పట్టణాలకు వలస పోయే ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని నుండే వెలవాడే వ్యర్థాలు పాలేరు నదిలో కలిస్తే పాలేరు పరివాహక ప్రాంతాల ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నారు. పర్యావరణాన్ని ప్రేమించాలని చెప్పే పాలకులు పర్యావరణాన్ని హరించి వేసే ఇలాంటి విషపు ఫ్యాక్టరీలకు అనుమతులు ఎలా ఇచ్చారని నిలదీశారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించి, ప్రజలను నిస్సహాయులుగా తయారు చేసే ఈ ఫ్యాక్టరీ అనుమతులను వెంటనే రద్దుచేసి పర్యావరణానికి, పశుపక్షాదులకు సమస్త జీవరాశిని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ రోజు సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్,అఖిల పక్ష పార్టీల నాయకులు చేసినవ్పొరటం పోరాటం వలన ఈ రోజు నుండి ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాతనే నిర్మాణ పనులు మొదలుపెడతాము అని పనులు బంద్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పందిరి నాగిరెడ్డి, సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివ కుమార్,జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, రావిపహాడ్ రైతులు కాకి నారాయణ రెడ్డి, కాకి సురేందర్ రెడ్డి, శెట్టిగుడెం మాజీ సర్పంచ్ పానుగంటి మల్లారెడ్డి, పాపిరెడ్డి, కూడలి సర్పంచ్ నరసింహ రావు, మాజీ సర్పంచ్ సంగెం లింగయ్య, రవీందర్ రావు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గోపాల్ రెడ్డి,పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్యు రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య,గొడ్డలి నర్సయ్య, ఎస్.కే సయ్యద్, చిత్తలూరి లింగయ్య, టియుసీఐ జిల్లా అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్,సిపిఎం పార్టీ నాయకులు మల్లయ్య,వెలుగు మధు, గ్రామాల ప్రజలు హరిబాబు, దిలీప్, ప్రభంజన్, వీరబాబు, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.