బ్రహ్మ కుమారీస్ విశ్వ కల్యాణి భవన్ ప్రారంభోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్
బ్రహ్మ కుమారీస్ విశ్వ కల్యాణి భవన్ ప్రారంభోత్సవ వేడుకలు, సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు విజయవంతం చేయాలని బ్రహ్మ కుమారీస్ కోరుట్ల ఇంచార్జి బికె రాజేశ్వరి పిలుపునిచ్చారు. కోరుట్ల పట్టణంలోని వాసవి కళ్యాణ భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రజాపిత బ్రహ్మా కుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం, కోరుట్ల శాఖ రజతోత్సవాలను ఈ నెల 18,19 తేదీల్లో రెండు రోజుల పాటు స్థానిక కల్లూర్ లోని శివసాయి ప్రెస్టీజ్ పార్క్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ బ్రహ్మా కుమారీ సేవా కేంద్ర ఆధ్వర్యంలో 1989 లో కోరుట్లలో సంస్థ సేవలు ప్రారంభమయ్యాయని తెలిపారు. 1989 నుండి 1998 వరకు బ్రహ్మా కుమారీ పాఠశాల రూపంలో ఇక్కడ సేవలు జరిగాయని, 1998 సెప్టెంబర్ లో అధికారికంగా కల్లూర్ రోడ్ లో శాఖను ప్రారంభించామని అన్నార. గత 26 సంవత్సరాలలో ఈ శాఖ ఆధ్వర్యంలో కోరుట్ల నగరం, చుట్టూ పక్క గ్రామాల్లో రకరకాల కార్యక్రమాల ద్వారా వేలాది మందికి ఈశ్వరీయ జ్ఞానం, రాజయోగముల సందేశాన్ని ఇవ్వడం జరిగినదన్నారు. దాదాపు వందల మంది సంస్థ బోధనలను తమ నిత్య జీవితంలో ఆచరిస్తూ జీవితంలో సుఖ శాంతులను పొందుతున్నారని తెలిపారు. సంస్థ చేస్తున్న సేవలను గుర్తించి నలుగురికి ఈ సేవ లాభాన్ని చేకూర్చాలనే ఉద్దేశ్యంతో కల్లూర్ లోని శివ సాయి ప్రెస్టీజ్ పార్క్ లో సంస్థ శాశ్వత భవన నిర్మాణమున కై ఈ వెంచర్ వారు భూమిని విరాళంగా ఇచ్చారని తెలిపారు. సంస్థ సభ్యుల స్వచ్ఛంద సహకారంతో ఈ భూమిలో విశ్వ కల్యాణి భవనం అనే పేరుతో శాఖ శాశ్వత భావన నిర్మాణం పూర్తయిందన్నారు. ఈ సందర్భంగా సంస్థ రజతోత్సవాలు, భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శివ సాయి ప్రెస్టీజ్ పార్క్ లో డిసెంబర్ 18, 19 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంస్థ హైదరాబాద్ సబ్ జోన్ ఇన్ చార్జ్ రాజయోగిని బ్రహ్మా కుమారీ కుల్దీప్ దీదీజీ ముఖ్య అతిథిగా హాజరవుతారని, కరీంనగర్ బ్రహ్మా కుమారీస్ ఇన్ చార్జ్ రాజయోగిని బ్రహ్మా కుమారి విజయ అక్కయ్య, హైదరాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుండి సంస్థ సేవాధారులు, సభ్యులు పాల్గొంటారని చెప్పారు. 18, తేది బుధవారం రోజు ఉదయం రాజయోగిని బ్రహ్మా కుమారీ కుల్దీప్ దీదీ కర కమలాల ద్వారా భవన ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు. సాయంకాలం 6.00 గంటలకు పుర ప్రముఖుల కోసం నూతన భవనంలో “సుఖ శాంతుల కోసం ఆశీర్వాదాలను ఇవ్వడం, ఆశీర్వాదాలను తీసుకోవడం” అను అంశంపై ఆత్మీయ స్నేహ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంఎల్ఏ డా. కల్వకుంట సంజయ్ ముఖ్య అతిథిగా, గౌరవ అతిథులుగా మున్సిపల్ చైర్మెన్ అన్నం లావణ్య అనిల్, ఆర్డీవో జివాకర్ రెడ్డి, బిజెపి నాయకులు సురభి నవీన్ కుమార్, కాంగ్రెస్ నాయకులు జువ్వాడి నర్సింగ్ రావు, మాజీ ఎంపీపీ తోట నారాయణ, మాజీ జడ్పీటిసి దారిశెట్టి లావణ్య రాజేష్, కల్లూర్ మాజీ సర్పంచ్ వనతడుపుల అంజయ్య, మాజీ ఎంపీటీసీ చిట్నేని లతా రమేశ్ పాల్గొంటారని తెలిపారు. 19,వ తేదీ గురువారం రోజు ఉదయం బ్రహ్మా కుమారీ సభ్యుల కోసం రజతోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.