అభిషేకం అంటే ఆలోచన శుద్ధి
శృంగేరి శారదాపీఠ ఆస్థాన పౌరాణికులు డాక్టర్ గర్రెపల్లి మహేశ్వరశర్మ
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, ఫిబ్రవరి 24 : అభిషేకం అంటే మంత్రాలు చదువుతూ దేవుడిపై నీళ్లు పోసి నమస్కరించడం కాదని, మన మనసులో భావాలు, ఆలోచనలు శుద్ధి చేసుకోవడమే అభిషేకమని శృంగేరి శారదా పీఠ ఆస్థాన పౌరాణికులు డాక్టర్ గర్రెపల్లి మహేశ్వరశర్మ పేర్కొన్నారు. సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో కోరుట్ల వాసవి కళ్యాణ భవనంలో జరుగుతున్న శ్రీలింగ మహాపురాణ సప్తాహంలో భాగంగా సోమవారం 6వ రోజు ప్రవచనం కొనసాగింది. ఈ సందర్భంగా శర్మగారు మాట్లాడుతూ ప్రతిరోజు దేవుడికి అభిషేకం చేస్తున్నాను, అయినా ఫలితం కనిపించడం లేదనుకునేవారు ఈ విషయంగా ఆలోచించాలని, మనసులో ఉండే ఆలోచనలు శుద్ధి చేసుకోవడమే అభిషేకం యొక్క మూలతత్వమని పేర్కొన్నారు. లింగ రూపంలో అభిషేకం చేసేటప్పుడు ఏ ద్రవ్యంతో అభిషేకం చేసినా కిందికి జారిపోతుందని, ఈ తత్వం తెలుసుకొనే శివున్ని పూజించాలన్నారు. బ్రహ్మ, విష్ణు మొదలగు దేవతలు అందరూ ఆ శివుని పూజించి శక్తులు పొందిన వారేనని శ్రీలింగ మహాపురాణంలో పేర్కొన్నట్లు వివరించారు. లింగ రూపంలో ఉన్న శివుణ్ణి పూజిస్తే సమస్త దేవి, దేవతలందరినీ పూజించిన ఫలం కలుగుతుందని, అంతటి మహత్తు లింగరూపానికి ఉందని, ఎవరైతే లింగ రూపంలో ఉన్న శివున్ని అర్చన చేస్తారో వారికి సుఖ, సంతోషాలకు లోటు ఉండదన్ని మహేశ్వరశర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ ప్రచార సమితి అధ్యక్షులు మంచాల జగన్, ప్రధాన కార్యదర్శి బట్టు హరికృష్ణ, పురాణ కమిటీ చైర్మన్ పడిగెల శ్రీనివాస్, కన్వీనర్ మోటూరి రాజు, మాదిగ సంఘ అధ్యక్షులు శనిగారపు రాజేశం, మహాదేవ స్వామి ఆలయ చైర్మన్ నరేష్, అర్చకులు భరద్వాజశర్మ, ముదిరాజు సంఘ అధ్యక్షులు పిట్టల లింగం, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు హరికృష్ణ, వినోద్, నిర్వాహకులు నీలి కాశీనాథ్, శక్కరి వెంకటేశ్వర్, పొద్దుటూరి జలంధర్, వనపర్తి చంద్రం, పల్లెర్ల మహేందర్, శ్రీనివాస్’తో పాటూ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.