సరస్వతి శిశు మందిర్ విద్యార్థులకు అవగాహన సదస్సు
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ : కోరుట్ల పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో శుక్రవారం తేజ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న సఖి సెంటర్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ కల్కూరి లావణ్య పర్యవేక్షణలో మహిళా సాధికారత జెండర్ స్పెషలిస్ట్ బి.స్వప్న, ఎస్హెచ్ఈ టీం ఉమెన్ గర్ల్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ జి.రాజ పూజిత, కేస్ వర్కర్ ఎం.భాగ్యలక్ష్మి, ఏహెచ్టీయూ సిహెచ్ సౌజన్య అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సఖి ఫౌండేషన్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ లావణ్య మాట్లాడుతూ పిల్లలకు ముఖ్యంగా మైనర్ వయసు హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులకు ఈ బయట ప్రపంచంలో జరుగుతున్న చెడు ప్రభావాలు, గంజాయి, మద్యం సేవించడం అలవాట్ల వలన జీవితాలు ఎలా కోల్పోవాల్సి వస్తుందని తల్లిదండ్రులకు చెడ్డ పేరు ఏ విధంగా తీసుకొస్తున్నారో ఎలా జైలు పాలు అవుతున్నారో, విద్యార్థులు ప్రత్యేకంగా ఇంట్లో మొబైల్ వ్యసనం వలన ఎలాంటి చెడు మార్గంలో ప్రయాణిస్తున్నారు అనే అంశాలపై అవగాహన కల్పించారు. మైనర్ అమ్మాయిల విషయంలో ఎలాంటి వేధింపులకు గురి చేసినా పోక్సో చట్టం కింద 16 సంవత్సరాల జైలు శిక్షణ అనుభవించాల్సి వస్తుందని తెలిపారు. ఎలాంటి కేసు అయిన గాని భవిష్యత్తులో ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్లాలనుకున్నా కూడా కేసులు ఉండటం వల్ల జీవితం కోల్పోవాల్సి వస్తుందని, అమ్మాయిలు పెరిగే వయసులో ఆకర్షణ వలన అబ్బాయిలతో పరిచయాలు పెంచుకొని, వాట్సప్, ఇంస్టాగ్రామ్, స్నాప్ చాట్ లలో వారితో స్నేహం వలన వారు ఏ విధంగా చెడు మార్గంలో తీసుకెళ్తున్నారు, అలాంటి విషయాలను చెప్పి వీటన్నింటికీ ఏ విధంగా దూరంగా ఉండాలని, ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఎవరి సహాయం తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే దానిపై పలు సూచనలు చేశారు. సమాజం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని ఏ ఆపద వచ్చినా తెలియజేయాలని తెలిపారు. ఎస్హెచ్ఈ టీం రాజపూజిత మాట్లాడుతూ సమాజంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, ఎవరైనా వేధింపులు గురి చేసినా చెప్పుకోవడానికి ఇబ్బంది ఉన్నా, తల్లిదండ్రులకు చెప్పుకోడానికి ఇబ్బంది ఉన్నా, పాఠశాల యాజమాన్యానికి చెప్పుకోడానికి ఇబ్బందులు ఉన్నా, షీ టీంకు తెలియజేయాలని తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి వారి బాధను చెప్పుకోవచ్చని మీ ఫోన్ నెంబర్ గాని, మీ పేర్లు గాని చాలా గోప్యంగా ఉంటాయని ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని సమాజంలో ఇప్పుడున్న వ్యవస్థ ఎలా ఉందో విద్యార్థులకు తెలియజేశారు. డిస్టిక్ హబ్ ఫర్ ఎంపవర్ మెంట్ ఆఫ్ ఉమెన్ బి.స్వప్న జెండర్ స్పెషలిస్ట్ మాట్లాడుతూ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలిపారు. ఆంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ లో భాగంగా ఈ రోజులలో మానవులను ఏ విధంగా ఒత్తిడికి గురి చేసి మాయమాటలు చెప్పి బయట దేశాలకు పంపిస్తున్నారో బయట ప్రపంచంలో ఎలా జరుగుతుందో యువకులను కూడా బానిసలుగా మార్చుకొని వారితో వ్యాపారాలు చేస్తున్న విషయాలను కూడా వివరించారు. పాఠశాల కరస్పాండెంట్ నీలి శ్రీనివాస్ మాట్లాడుతూ పిల్లలకు హై స్కూల్ వయసులోనే ఇంటిలో, సమాజంలో బయట వారితో ఎలా మెదలాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆపద వచ్చినప్పుడు ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై అవగాహన కల్పించిన తేజ ఫౌండేషన్, షీ టీం, డిహెచ్ ఢబ్ల్యూ, ఏహెచ్టీయూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చివరగా తేజ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన అతిథులందరికీ పాఠశాల పక్షాన చిరు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు గోపు వెంకటేష్, కరస్పాండెంట్ నీలి శ్రీనివాస్, కార్యదర్శి వనపర్తి చంద్రమోహన్, కొండబత్తిని అమర్నాథ్ అధ్యాపక బృందం, మాతాజీలు పాల్గొన్నారు.