మెట్పల్లి ప్రిన్సిపాల్ కు “ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార్-2024”
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 12 : డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 93,వ జయంతిని పురస్కరించుకొని హైదరాబాదులోని ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్యకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార్-2024 అవార్డును ఆ సంస్థ ఛైర్మన్ డాక్టర్ విఆర్ఎస్ రాజు బుధవారం అందజేశారు. దాదాపు మూడున్నర దశాబ్దాల నుంచి విద్యారంగంలో విశిష్ఠ సేవలను అందించినందుకు ఈ అవార్డును ప్రదానం చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. విద్యా రంగంలో ఆయన అందించిన సేవలకుగాను ప్రజాప్రతినిధులుగా, న్యాయవాదులుగా, ఉపాధ్యాయులుగా, రెవెన్యూ అధికారులుగా, పోలీసు అధికారులుగా ఎక్సైజ్ అధికారులుగా, ఆర్థిక శాఖ అధికారులుగా గుర్తింపు పొందారని, అందుకోసం మెట్ పల్లి ప్రిన్సిపాల్ ను ఎంపిక చేశామని ప్రగతి ఫౌండేషన్ ఛైర్మన్ రాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్యను ఘనంగా శాలువాతో సన్మానం చేయడంతో పాటు మెమోంటో, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. సామాజిక రంగాలలో అనేక మంది వ్యక్తులు ఉన్నారని, వారిని ఎంపిక చేసి అలాంటి ఉత్తమ అవార్డులను అందించాలని “ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార్ – 2024 అవార్డు” గ్రహీత డాక్టర్ కే.వేంకయ్య ఫౌండేషన్ నిర్వాహకులకు సూచించారు. ఈ అవార్డును అందుకోవడం వల్ల తనకు మరింత బాధ్యత పెరిగిందని ప్రిన్సిపాల్ స్పష్టం చేశారు. అవార్డును ప్రదానం చేసినందుకు ప్రగతి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ విఆర్ఎస్ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి డిగ్రీ కళాశాల అకాడమిక్ కో-ఆర్డినేటర్ బిల్ల రాజేందర్, సర్పంచ్ ప్రతాప్ సింగ్, నాయకులు మంచి కట్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.