తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి,
జర్నలిస్టుల సమస్యలపై సమిష్టిగా పోరాడుతూ హక్కులను సాధించుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్
(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య పిలుపునిచ్చారు. గురువారం నారాయణపేటలోని లక్ష్మీ బాంకిట్ హాల్ లో టడబ్ల్యూజేఎఫ్ జిల్లా ద్వితీయ మహాసభ ఘనంగా జరిగింది.ఈ మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో జర్నలిస్టుల పక్షాన నిలిచి జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతున్న ఏకైక యూనియన్ టీడబ్ల్యూజేఎఫ్ అని అన్నారు. టీడబ్ల్యూజేఎఫ్ లో సభ్యులుగా చేరే జర్నలిస్టులకు సంఘం అన్ని సందర్భాలలో అండగా ఉంటుందని అన్నారు.
యూనియన్ లో చిన్న, పెద్ద భేదం లేకుండా, ప్రతి జర్నలిస్టుకు సభ్యత్వం, సమానత్వం కల్పించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం ద్వారా హెల్త్ కార్డులు, అర్హులైన వారికి అక్రెడిటేషన్ కార్డులు ఇప్పించేందుకు ఫెడరేషన్ కృషి చేస్తుందని చెప్పారు. ముఖ్యంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఫెడరేషన్ పోరాటం చేస్తుందని అన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై మొన్న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు యావత్ జర్నలిస్టులను ఆందోళనకు గురి చేస్తుందని అన్నారు. జిల్లా, మండల, నియోజకవర్గ కేంద్రాలలో ఇళ్ల స్థలాల సాధనకు పోరాటం చేయడానికి ఫెడరేషన్ సిద్దమవుతుందని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో జర్నలిస్టులకు తీరని అన్యాయం జరిగిందని, ఈ ప్రభుత్వంలో కూడా అలాగే జరిగితే పోరాటం చేయక తప్పదని అన్నారు. అన్ని జిల్లాల్లో ఫెడరేషన్ మహాసభలు త్వరలో పూర్తి చేసి రాష్ట్ర మహాసభలు పెద్ద ఎత్తున జరిపేందుకు సన్నద్దమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్ డబ్ల్యూజే కార్యదర్శి పులిపలుపుల ఆనందం, ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయ్ కుమార్, వల్లాల జగన్,గుడిగ రఘు, కార్యదర్శి రాజశేఖర్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు లొట్టి శ్రీను, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకట్ రాములు, దాసరి నారాయణ, కోశాధికారి సంస్థాపురం లింగం, సిపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. వెంకట్ రామ్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు గోపాల్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బలరాం, 9వ వార్డు కౌన్సిలర్ మహేష్ కుమార్, తెలంగాణ రైతు సంఘం కార్యదర్శి అంజిలయ్య గౌడ్, ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నరేష్, అంబేద్కర్ సంఘం నాయకులు పృద్విరాజ్, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకుడు డేవిడ్ తదితరులు ప్రసంగించారు.