దేవరకద్ర ఇసుక మాఫియాపై… తహసీల్దార్, ఎస్ఐలకు ఫిర్యాదు
ఇసుక అక్రమ రవాణా ఆపాలని వినతి
ప్రతిరోజు 20 ట్రాక్టర్లతో దర్జాగా ఇసుక అక్రమ రవాణా
కలెక్టర్ కు, ఎస్పీకి ఫిర్యాదు చేసిన… ఆగని అక్రమ దందా
ఇసుక మాఫియాకు అధికారుల అండ దండలు
సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్
తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి,
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని, ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని శనివారం దేవరకద్ర తహసీల్దార్, ఎస్ఐలకు ఫిర్యాదు చేసినట్లు *సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు. దేవరకద్ర మండలం వెంకటాయపల్లి గ్రామంలో ఇసుక మాఫియా గత కొంతకాలంగా వాగు నుండి ప్రతిరోజు దాదాపు 20 ట్రాక్టర్లుతో ఇసుకను దేవరకద్ర, మహబూబ్ నగర్, ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తుందని బాధితులు రామస్వామి, వెంకటేష్ లు ఫిర్యాదు చేసినట్లు ప్రవీణ్ పేర్కొన్నారు. అంతేకాకుండా తమ పొలంలో వేసిన కాకరకాయ పంటను సైతం ఇసుక మాఫియా ట్రాక్టర్లతో తొక్కి వేసిందని, తమకు పంట నష్టం జరిగిందని, తమ పంటను నష్టం చేసిన ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని దేవరకద్ర తహసిల్దార్ కృష్ణయ్యకు, ఎస్సై నాగన్నలకు లిఖితపూర్వకంగా బాధితులు శనివారం ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.
కలెక్టర్ కు, ఎస్పీకి ఫిర్యాదు చేసిన… ఆగని అక్రమ దందా
దేవరకద్రలో ఇసుక మాఫియా ఇసుకను అక్రమంగా తరలిస్తుందని ఈనెల 16న మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయికి, ఎస్పీ జానకికి భాదితులు ఫిర్యాదు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రవీణ్ గుర్తు చేశారు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి 15 రోజులు గడవక ముందే దేవరకద్రలో మళ్ళీ ఇసుక మాఫియా, తమ అక్రమ దందాను కొనసాగిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇసుక మాఫియాకు స్థానికంగా కొందరు పోలీసులు, రెవిన్యూ అధికారులు కొమ్ముకాస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇకనైనా జిల్లా కలెక్టర్, ఎస్పీలు వెంటనే ఇసుక మాఫియాపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయిస్తామని సామాజిక కార్యకర్త, *నేనుసైతం*” స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిద్ది ప్రవీణ్ కుమార్ తెలిపారు