అంగరంగ వైభవంగా దత్త జయంతి ఉత్సవాల ముగింపు
కన్నుల పండుగగా రథోత్సవ కార్యక్రమం
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 16 : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో రెండవ షిరిడిగా పేరు గాంచిన శ్రీ సాయిరామ దేవాలయంలో దత్త జయంతి ఉత్సవాలను దేవాలయ కార్యనిర్వహణాధికారి కే.కాంతా రెడ్డి నిర్వహణలో ఈ నెల 08,వ తేదీ ఆదివారం నుండి 15,వ తేదీ ఆదివారం వరకు వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం సామూహిక గురు చరిత్ర పారాయణ మహా యజ్ఞం ఘనంగా నిర్వహించారు. ఉదయం 9:30.ల నుండి సాయంత్రం వరకు లక్ష్మి సమేత దత్తాత్రేయ స్వామి చర ప్రతిష్ట, తదుపరి పూర్ణాహుతి, మండప ఉద్వాసన, స్థాపిత కలశములచే దత్తాత్రేయ స్వామికి అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పారాయణం చేసిన భక్తులకు పారాయణం చేసిన గ్రంథము, స్థాపితం కలశ కొబ్బరికాయ వితరణ, గురుస్తాన్ సాయినాధునికి భక్తులచే పాలాభిషేకం, సాయంత్రం నాలుగు గంటలకు సాయినాధుని, దత్తాత్రేయ స్వామి రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రథోత్సవము సాయంత్రం 04 గంటలకు దేవాలయం నుండి బయలుదేరి కొత్త బస్టాండ్, ప్రసాద్ సెలెక్షన్ రోడ్డు, కూరగాయల మార్కెట్, జవహర్ రోడ్డు, వెంకటేశ్వర స్వామి దేవాలయం, గాంధీ రోడ్, కార్గిల్ చౌక్, లక్ష్మీ టాకీస్, ఝాన్సీ రోడ్, కల్లూరు రోడ్డు, కొత్త బస్టాండ్ మీదుగా తిరిగి దేవాలయానికి చేరుకుంది. భక్తులు, మాతలు మంగళహారతులతో స్వామి వార్లకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి కే.కాంతా రెడ్డి, పుర ప్రముఖులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.