విస్తరిస్తున్న పోస్టల్ సేవలు.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి జనవరి 11:
– విద్యాసంస్థల్లో ఆధార్ కేంద్రాల నిర్వహణ
– సద్వినియోగం చేసుకుంటున్న విద్యార్థులు
– గ్రామీణ ప్రాంతాల్లో పాస్‌పోర్టులకు పెరుగుతున్న డిమాండ్
– పోస్టల్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో స్లాట్ల సంఖ్య పెంపు
– సుకన్య సమృద్ధి యోజనలో నెంబర్‌వన్‌గా తెలంగాణ సర్కిల్
– పోస్టల్ ఇన్సూరెన్స్‌కు విశేష ఆదరణ
– గ్రూప్ ఇన్సూరెన్స్‌లపై సంస్థల ప్రత్యేక దృష్టి
– కొరియర్, పార్సిల్ సేవలకు ప్రాధాన్యత
– సామాన్యులకు చేరువగా పోస్టల్ బ్యాంకింగ్
‘పోస్ట్’…ఈ కేక వినగానే ఒకప్పుడు ఇంట్లోంచి పరుగెత్తుకొచ్చి, ఉత్తరాల్ని గుండెలకు హత్తుకొని తీసుకొనేవారు. మనీఆర్డర్ వస్తే దాన్లోంచి రూ.ఐదో, పదో సంతోషంగా పోస్ట్‌మ్యాన్ చేతిలో పెట్టేవాళ్లు. ఎవరికైనా ప్రభుత్వోద్యోగం వచ్చినట్టు పోస్టులో అపాయింట్‌మెంట్ లెటర్ వస్తే, ఆ సంతోషాన్ని ఫస్ట్ షేర్ చేసుకొనేది పోస్ట్‌మ్యాన్‌తోనే… నోరు తీపి చెయ్యందే పంపించేవారు కాదు. తపాలాశాఖ (పోస్టల్) ప్రజల జీవితాలతో అంత మమేకమై పోయింది. ఇప్పుడు సాంకేతికత పెరిగింది. వాట్సాప్‌ల్లో మెసేజ్‌లు పెట్టడం, వెంటనే రిప్లరులు వస్తుండటంతో ఉత్తరాలు రాసేవారి సంఖ్య క్రమేణా తగ్గిపోయింది. ఫోన్‌పే, గూగుల్ పే అంటూ ఆన్‌లైన్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాక మనీఆర్డర్లు చేసేవారూ కరువయ్యారు. దీనితో తపాలాశాఖ రూపురేఖలు మారాయి. పాత తరం సేవల్ని కొనసాగిస్తూనే, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ మరింత వేగంగా ప్రజలకు చేరువ అవుతోంది.నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోఇప్పుడు ఆధార్‌తోనే అన్ని లింక్ అయ్యి ఉన్నాయి. పిల్లలు పుట్టగానే మొదట చేయాల్సింది ఆధార్ నమోదే! ఒకసారి ఆ నెంబర్ వచ్చాక, ఇక మన జీవితంలో ప్రతిఒక్కటీ దానితోనే ముడిపడి ఉండటం గమనార్హం. అంతటి ప్రాధాన్యత ఉన్న ఆధార్‌తో పోస్టల్ శాఖ కలిసి పనిచేస్తున్నది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆధార్‌లో తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి నానా యాతన పడాల్సి వస్తుంది. ఒక్కసారి ఎడ్యుకేషన్ రికార్డుల్లో ఆ తప్పు దొర్లితే, ఇక జీవితాంతం దాన్ని అలాగే కొనసాగించుకోవాల్సిందే. ఈ నేపథ్యంలోనే పోస్టల్ శాఖ ఆధార్‌తో ఆనుసంధానమై పని చేసేందుకు ముందుకు వచ్చింది. ప్రజలు ఆధార్ సెంటర్లకు రావడం కాకుండా, తామే ప్రజల వద్దకు వెళ్లి సేవలు అందించాలని తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ పీవీఎస్ రెడ్డి నిర్ణయించారు. రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలు, అపార్ట్‌మెంట్లు, కాలనీల్లో ఆధార్ నమోదు, కరెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. దీనితో ప్రజలు, విద్యార్థులకు అనేక సమస్యలకు పరిష్కారం లభించినట్టు అయ్యింది.పోస్టల్ ఇన్సూరెన్స్‌కు ఆదరణ,పోస్టల్ ఇన్సూరెన్స్‌కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుంది. ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ అంటే ఎల్ఐసీ లేదా ప్రయివేటు కంపెనీలే గుర్తుకొచ్చేవి. ఇప్పుడు పోస్టల్ ఇన్సూరెన్స్ మరింత మెరుగైన సేవల్ని అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకుంది. దీనివల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి కూడా లభిస్తుంది. ఏటా పాలసీలపై బోనస్‌ను ప్రకటిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో నవంబర్ వరకు గ్రామ్ సురక్ష హోల్ లైఫ్ అష్యూరెన్స్ పాలసీలు 1,63,975 జారీ అయ్యాయి. గ్రామ్ సంతోష్ ఎండోమెంట్ అష్యూరెన్స్ పాలసీలు 14,94,549, గ్రామ్ సువిధ కన్వర్టబుల్ హోల్ లైఫ్ అష్యూరెన్స్ పాలసీలు 34,896 జారీ అయ్యాయి.ఇవి కాకుండా గ్రామీణ ప్రజల అవసరాలు, వారి ఆర్థిక స్థోమతను బట్టి చిన్న మొత్తాలతో పలు జీవిత బీమా పాలసీలను అందుబాటులోకి తెచ్చారు. ఆదర్శవంతంగాబాలికల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సుకన్య సమృద్ధి యోజన పథకం రాష్ట్రంలో విజయవంతమైంది. ప్రత్యేకించి తెలంగాణ సర్కిల్ అధికారులు ప్రతి పోస్టాఫీసులోనూ లక్ష్యాలను నిర్దేశించి, దేశంలోనే ఎక్కువ మంది బాలికలకు ఈస్కీంను అందుబాటులోకి తెచ్చారు. కీసర వంటి పలు గ్రామీణ ప్రాంత పోస్టాఫీసుల్లో అక్కడి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు సుకన్య సమృద్ధి యోజన పథకం కోసం ప్రత్యేక ఖాతాల్ని తెరిపించారు. పోస్టల్ సిబ్బంది, ఆయా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల సంయుక్త కృషితో పేద కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా దాతల ద్వారా బాలికలకు ప్రీమియం కట్టించారు. పోస్టల్ సిబ్బంది నిత్యం ప్రజలతో మమేకం కావడం వల్లే ఇది సాధ్యమైంది.అన్ని సేవలు ఒకేచోట పోస్టాఫీసుల ద్వారా ప్రజలకు లభించని సేవ అంటూ లేదు. పాస్‌పోర్టుల్ని కూడా పోస్టాఫీసుల ద్వారానే జారీ చేస్తున్నారు. తాజాగా గ్రామీణ ప్రాంతాల్లో విదేశాలకువెళ్లే వారి సంఖ్య పెరగడంతో పాస్‌పోర్ట్ స్లాట్ల సంఖ్యను కూడా పెంచారు. పాస్‌పోర్టుల కోసం మారుమూల ప్రాంతాల ప్రజలు హైదరాబాద్‌కు రాకుండా, పోస్టాఫీసుల ద్వారానే దరఖాస్తుల స్వీకరణ, పోలీస్ వెరిఫికేషన్ సహా అన్ని సేవల్ని పక్కాగా అందిస్తున్నారు.ఆర్డీల్లో రికార్డు పోస్టల్ రికరింగ్ డిపాజిట్లను (ఆర్డీ) సేకరించడంలో తెలంగాణ సర్కిల్ రికార్డును సాధించింది. సాధారణ బ్యాంకులకంటే పాయింట్ 5 శాతం నుంచి 1 శాతం వరకు అధిక వడ్డీ రేట్లు పోస్టల్ ఆర్డీ ఖాతాల ద్వారా లభిస్తున్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, పోస్టల్ సేవింగ్స్ ఖాతాలను నిర్వహిస్తున్నారు. ప్రజలు పోస్టాఫీసులకు రాకుండా, పోస్టల్ సిబ్బందే గ్రామాలకు వెళ్లి, వారికి సేవలు అందిస్తుండటం గమనార్హం. ఫ్రాంచైజీలు.గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ సేవల్ని విస్తరించేందుకు చదువుకున్న యువతీ యువకులకు పోస్టల్ ఫ్రాంచైజ్ కేంద్రాలను ఇస్తున్నారు. పోస్టాఫీసుల్లో లభించే సేవలన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. స్టాంపుల విక్రయం మొదలు రికరింగ్ డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాలు, మనీఆర్డర్లు, కొరియర్, కార్గో, ఇన్సూరెన్స్ సేవలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ ఇక్కడ ప్రజలకు లభిస్తుండటం విశేషం. తెలంగాణ సర్కిల్ పరిధిలోని 6,208 పోస్టాఫీసులకు తోడు ఈ ఫ్రాంచైజీలు అదనంగా సేవల్ని అందిస్తున్నాయి.పేదల విశ్వాసమే మా విజయ రహస్యం జీ హైమవతి, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్, హైదరాబాద్ సౌత్, ఈస్ట్ డివిజన్ ఆధార్ సహా అన్ని సేవల్ని పోస్టల్ శాఖ ఒకేచోట అందిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల్లో ఆధార్ సేవలకు విశేష స్పందన కనిపిస్తుంది. ప్రజలు స్వచ్ఛందంగా పోస్టాఫీసులకు వచ్చి ఇన్సూరెన్స్, రికరింగ్ డిపాజిట్ సహా పలు సేవల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఒకప్పటి పోస్టాఫీసు సేవలకు, ఇప్పటి సేవలకు చాలా వ్యత్యాసం ఉంది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ, ప్రజలకు మరింత చేరువుగా, వేగంగా సేవల్ని అందిస్తున్నాం. పేద, మధ్య తరగతి ప్రజల విశ్వాసంమే మమ్మల్ని నిలబెడుతుంది. మా సిబ్బంది కూడా వారితో స్నేహపూర్వకంగా, గౌరవంగా మెలగడమే మా విజయాల వెనుకున్న విజయ రహస్యం.ఆధార్ తిప్పలు తప్పాయి .జీటీ జ్యోతి, ప్రధానోపాధ్యాయురాలు, బీఆర్ఆర్ గర్ల్స్ హైస్కూల్, బర్కత్‌పుర.పోస్టల్‌శాఖ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు. స్కూల్లో విద్యార్థినుల ఆధార్ కరెక్షన్స్ కోసం వారికి లెటర్ రాయగానే మూడు రోజులు మా స్కూల్‌లోనే ప్రత్యేక క్యాంప్ నిర్వహించారు. దానివల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. మా స్కూల్ యాజమాన్యం కూడా మమ్మల్ని అభినందించింది. ఆధార్ సేవలు అందించిన సిబ్బంది చాలా ఓపిగ్గా, విద్యార్థులకు అర్థమయ్యేలా అన్ని విషయాలు వివరించారు. ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థులకు చాలా మేలు జరిగింది. యూడైస్ సహా ప్రభుత్వ రికార్డుల్లో విద్యార్థుల పేర్లు, డేట్ ఆఫ్ బర్త్, తల్లిదండ్రుల పేర్లు తప్పులు లేకుండా నమోదు చేయగలిగాం.ప్రజల నుంచి విస్తృత ఆదరణపోస్టాఫీసుల సేవలకు ప్రజల నుంచి విస్తృత ఆదరణ లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాలకు పోస్టల్ బ్యాంకింగ్ సేవల్ని అందుబాటులోకి తెచ్చాం. గ్రూప్ ఇన్సూరెన్స్‌ల కోసం ప్రయివేటు సంస్థల నుంచి డిమాండ్ పెరుగుతుంది. ఇన్సూరెన్స్ గడవు తీరితే 15 రోజుల్లో మొత్తం సొమ్ము తిరిగి ఇచ్చేస్తాం. డెత్ క్లెయిమ్ అయితే 30 రోజుల్లో పరిష్కరిస్తాం. అన్ని సేవలకు నిర్ణీత గడువును నిర్ణయించాం.ఆ గడువులోపు వాటిని పరిష్కరించాల్సిన బాధ్యతను స్థానిక పోస్టల్ అధికారులకే అప్పగించాం.మంచి ఫలితాలు వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మేం పెట్టుకున్న లక్ష్యాలను అధిగమించి, ప్రజలకు మరింత మెరుగైన సేవల్ని అందుబాటులోకి తెచ్చాం. తపాలాశాఖపై ప్రజలకు ఉన్న నమ్మకం, సిబ్బంది నిరంతర శ్రమ, అధికారుల కృషి వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయి.