పాలమూరులో 28 నుంచి మూడురోజులపాటు అవగాహన కార్యక్రమాలు
రైతన్నలకు 19వేల కోట్లకుపైగా రుణమాఫీ కింద చెల్లించాం.
బోనస్ కింద ఎకరానికి 12వేల నుంచి 18వేల వరకు చెల్లించాం
*విద్యార్థుల సమస్యను సమష్టిగా పరిష్కరించేందుకు సిద్దం* …
మఖ్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి.
తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి,
తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తికావస్తున్న సందర్భంలో..వరంగల్ లో ప్రజాపాలన ఉత్సవం తర్వాత…పాలమూరులో రైతులపండుగ కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని మఖ్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో భాగంగా మాట్లాడుతూ, పాలమూరు వేదికగా రైతన్నల కోసం
రైతు పండగ కార్యక్రమాన్ని ఈనెల 28 నుంచి 30 వ తేదీ వరకు మూడురోజులపాటు నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతులు వారి జీవన విధానం, టెక్నాలజీను ఉపయోగించి మరింతగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చేసిన కార్యక్రమానికి జిల్లా ఇన్ చార్జిగా తనను నియమించారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి పిలుపునిస్తున్నామని, 28, 29, 30వ తేదీ మధ్యాహ్నం వరకు దాదాపు 60 స్టాల్స్ ఏర్పాటు చేసి, వ్యవసాయంలో నిష్ణాతులైన వారిని పిలిపించి, రైతులకు డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేసి వ్యవసాయంలో ఆధునాతన పద్దతులపై అవగాహన కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని అన్నారు. అత్యాధుకని పనిముట్లు, ఇతర సాంకేతికత ఉపయోగించి, వ్యవసాయంతో దిగుబడి ఎక్కువ సాధించే దిశగా కార్యక్రమం ఉంటుందన్నారు. రైతులందరికీ వసతి, భోజన సదుపాయంతోపాటు రవాణా సౌకర్యం పూర్తిగా ఉచితంగా కల్పిస్తున్నామని.. పూర్తిగా రైతన్నల కోసం వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడమే ధ్యేయంగా చేపడుతున్నామని, జిల్లావ్యాప్తంగా రైతన్నలు పెద్దఎత్తున కార్యక్రమానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. గతంలో ఎప్పుడూ చెల్లించని విదంగా సుమారు 19వేల కోట్లకు పైగా నిధులు రుణమాఫీ కింద రైతులకు చెల్లించామని, ఇంకా దాదాపు 9500 కోట్లు చెల్లిస్తామని అన్నారు.
మఖ్తల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలు, మూడు మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటివరకు రుణమాఫీ కింద రైతులకు 325 కోట్ల రూపాయలు చెల్లించామని… ఇంకా కొంతమంది రైతులకు చెల్లించాల్సి ఉందని… బ్యాంకర్లతోపాటు 2 లక్షలపైన ఉన్న వారికి సీఎం ఆధ్వర్యంలో బ్యాంకు అధికారులకు సూచనలు అందించి, వారికి సైతం రుణమాఫీ అందేవిధంగా చర్యలు చేపడతామన్నారు.
గతంలో రుణమాఫీ కింద ఎంత చెల్లించారు, ఇప్పుడు మా ప్రభుత్వం ఏడాదిలో ఎంత చెల్లించామో, గతంలో పంటల దిగుబడి ఎలా ఉఁది, ఇప్పుడు ఎలా ఉంది, గతంలో కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభించారు, మా హయాంలో ఎప్పుడు ప్రారంభమయ్యాయి, గతంలో ఎంత రేటుకు కొన్నారు, ఇప్పుడు మేమెంత రేటుకు కొంటున్నాం… రైతులకు ఎంతమందికి వరి బోనస్ ఇచ్చామో పూర్తి వివరాలు ఉన్నాయని అన్నారు. రైతులకు లేనిపోని మాటలు చెప్పి వారిని మభ్యపెట్టే చర్యలు సరికావని చెప్రారు. ప్రతి గ్రామంలో పంచాయితీ కార్యక్రమం వద్ద రైతులకు ఎంతమందికి రుణమాఫీ వచ్చిందో వివరాలు పూర్తిగా అందుబాటులో ఉంచామని, రుణమాఫీ ఎంతవరకు చేశామో అందరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు పెద్దస్థాయిలో మూడురోజులపాటు జరగనున్న అవగాహన సదస్సుకు తరలిరావాలని కోరారు. అంకెలు, తేదీలు అన్నీ ఉన్నాయని, గతంలో 9 సంవత్సరాలు, ప్రస్తుతం ఏడాదిలో రైతులకు ఎంత చేశామో చర్చించేందుకు సిద్దమని అన్నారు. అఖిలపక్ష నాయకులు ఎవరైనా సూచనలు చేస్తే వాటినీ తప్పకుండా సీఎం రేవంత్, వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కేవలం ఒక్క ఎకరం మీద రైతులకు బోనస్ కిందనే కేవలం 12వేల నుంచి 18 వేలక వరకు చెల్లించామన్నారు. రాష్ట్రంలోనే ఎక్కడా ప్రారంభం కాని సమయంలో క్రిష్ణ మండంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. రైతులుంటేనే దేశం, రాష్ట్రం, మఖ్తల్ నియోజకవర్గం అభివృద్ది చెందుతాయని, రైతన్నల కోసం ప్రభుత్వం వందశాతం కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. రైతు పండుగ కార్యక్రమానికి పెద్దఎత్తున రైతన్నలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
మాగనూరు ఘటనపై రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేద్దాం
మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో జరిగిన సంఘటనపై గతంలోనే స్పందించి ఏజెన్సీలతోపాటు సంబంధిత వారిపై చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు. తిరిగి మంగళవారం సైతం సంఘటన జరగడంపై స్పందిస్తూ….మఖ్తల్ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి పార్టీలకతీతంగా నాయకులు కలిసిరావాలని, అంతేగానీ సమస్యను భూతద్దంలో చూపెడుతూ, లేనిపోని ఇబ్బందులు సృష్టించి రాజకీయంకా లాభపడాలని చూస్తే నియోజకవర్గం నష్టపోతుందన్నారు. గతంలో వైద్యులు సైతం మఖ్తల్ ప్రాంతానికి రావడానికి ఎవరూ ఇష్టపడలేదని అన్నారు. సమస్యలపై మాట్లాడుతూ పోయి రాద్దాంతం చేయడం తనకు ఇష్టం లేదని, దానివల్ల అటు విద్యార్థులకు, ఇటు ప్రజలకు ఎవరికీ లాభం లేదన్నారు. మఖ్తల్ ప్రాంతంపై ప్రేమ ఉన్న ప్రతిఒక్కరినీ వేడుకుంటున్నానని, అన్ని విబాగాల్లో సమస్యల పరిష్కారానికి తాను చిత్తశుద్దితో ఉన్నానని, అధికారులు, నాయకులు ఎవరు ఎలాంటి సలహాలు, సూచనలు ఇచ్చినా వాటిని స్వీకరించి, సమస్య పరిష్కారానికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. మంగళవారం మాగనూరులో ఏమ్మార్వో సమక్షంలో అధికారులు, పాత్రికేయులు సైతం భోజనం చేశారని అన్నారు. దాదాపు 400మందిపైగా విద్యార్థులు తిన్నారని, కేవలం 20 మందికి మాత్రమే ఎందుకు ఇలా జరిగిందో పూర్తిస్తాయిలో ఎస్పీ ఆద్వర్యంలో విచారణ జరిపించాలని ఆదేశాలిచ్చామని అన్నారు. అసెంబ్లీలో సైతం ఇదే సమస్యపై ప్రస్తావించడానికి సిద్దమని, రాజకీయాలు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే చేద్దామని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని, ఎవరూ అధైర్యపడవద్దని, రాష్ట్ర ప్రభుత్వం, తామందరం అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో నేతలు లక్ష్మారెడ్డి, కట్టా సురేశ్ గుప్తా,మండలాధ్యక్షుడు గణేశ్ కుమార్, టౌన్ ప్రెసిడెంట్ బోయ రవికుమార్, చంద్రకాంత్ గౌడ్ ,వల్లంపల్లి లక్ష్మణ్, కావలి తాయప్ప, ఆడెం శ్రీనివాస్, కట్టా వెంకటేశ్, నాగరాజు, కావలి రాజేందర్, చందాపురం వెంకట్రాములు, ఓబ్లేశ్, నూరుద్దీన్, ఫయాజ్, అబ్దుల్ రెహమాన్, హన్మంతు, వాకిటి శ్యామ్, శంషుద్దీన్, శాలం బిన్ ఉమర్, అస్ముద్దీన్, నగేశ్, కల్లూరి గోవర్దన్, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు,