ఆకట్టుకున్న ‘సాయి జీనియస్’ స్కూల్ ముందస్తు సంక్రాతి వేడుకలు
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, జనవరి 10: కోరుట్ల పట్టణంలోని ‘సాయి జీనియస్’ హై స్కూల్ లో శుక్రవారం ముందస్తు సంక్రాంతి వేడుకలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా పాఠశాల కరస్పాండెంట్ చౌకి రమేష్ మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయంలో సంక్రాంతి ఒక ముఖ్యమైన పండుగ అని, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయంలో సంక్రాంతి పండగ జరుపుకుంటామని తెలిపారు. సంక్రాంతికి ఇళ్ల ముందు కల్లాపి జల్లి గొబ్బేమ్మలతో వాకిళ్ళు అలంకరించి హరిదాసులు, గంగిరెద్దుల విన్యాసాలతో పండుగ వాతావరణం సంతరించుకొంటుందని అన్నారు. విద్యార్థులకు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులు రంగురంగుల ముగ్గులు వేసి, భోగి మంటలతో పాఠశాలలో సంక్రాంతి శోభను నింపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చౌకి సుధ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.