సంక్రాంతి సందర్భంగా రవాణా ఛార్జీల పెంపు సరి కాదు
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, జనవరి 11 : తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా రవాణా ఛార్జీల పెంచడం సరికాదని యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముజాహిద్ అన్నారు. ఛార్జీల పెంపుతో ప్రజలపై అధిక భారం పడుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలకు వెళ్ళే వారి సంఖ్య భారీగా ఉంటుందని, ఈ సమయాన్ని ఆసరాగా తీసుకుని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈసారి కూడా బస్సు ఛార్జీలను గణనీయంగా పెంచిందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోందని, చార్జీల భారం ముఖ్యంగా పల్లెలకు వెళ్లే కూలీలు, కార్మికులు, మధ్యతరగతి కుటుంబాలపై ఎక్కువగా ఉంటుందన్నారు. పండుగ సందర్భాల్లో సేవలు అందించాల్సిన రవాణా సంస్థ వ్యాపార లాభాల కోసం ప్రజల పట్ల దురాగతంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక బస్సుల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పేదవాళ్లకు సంక్రాంతి పండుగ భారం కాకూడదని, వెంటనే పెరిగిన రేట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.