దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన స్వామి వివేకానంద
– కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
శ్రీ సరస్వతి శిశు మందిర్ లో ఘనంగా జాతీయ యువజన దినోత్సవ వేడుకలు
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, జనవరి 11 : దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన స్వామి వివేకానంద యువతకు ఆదర్శప్రాయమని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. కోరుట్ల పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ లో శనివారం ఘనంగా జాతీయ యువజన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి పూర్వ విద్యార్థి పరిషత్ అధ్యక్షులు హరిస్మరణ రెడ్డి, పూర్వ విద్యార్థి పరిషత్ సహాయ కార్యదర్శి బొడ్ల శ్రీనివాస్ లు హాజరయ్యారు. సభాధ్యక్షులు, ప్రబంధ కారిణి అధ్యక్షుడు డాక్టర్ వేముల రవి కిరణ్, సమితి ఉపాధ్యక్షులు రాజ గంగాధర్ ఇరువురు ముఖ్య అతిథులను సాధారణంగా ఆహ్వానించి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా చిన్నారుల నృత్య ప్రదర్శనతో ప్రారంభమై యోగ్చాప్, వివేకానందుని వేషధారణతో భారతీయ సాంస్కృతిక వైభవాన్ని హైందవమత కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన అతని జీవిత చరిత్రను చిన్నారులు నాటక రూపంలో ప్రదర్శించి ఎంతగానో అలరించారు. ప్రముఖ అడ్వకేట్, పూర్వ విద్యార్థి బోడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ వివేకానందుని ఆశయాలను, ఆచరణలను విద్యార్థులు, యువత పాటించాలని పిలుపునిచ్చారు. వక్త హరిష్మరణ రెడ్డి మాట్లాడుతూ సనాతన ధర్మ గొప్పతనాన్ని వివేకానందుడు విదేశాలలో చూపించిన మన సంస్కృతి సాంప్రదాయాల విలువలు, బంధాలను కులమతాలకు అతీతంగా మంచి మనుషులుగా ఎలా ఉండాలో మంచి మనుషులుగా ఉండి గొప్ప మనుషులుగా ఎలా తయారు కావాలో వివరించారు. వివేకానందుని ఆదర్శంతోనే దేశంలోనే విద్యా భారతి పాఠశాలలను ప్రారంభించడం జరిగిందని, ఇప్పుడు దేశంలో కొన్ని వందల శిశు మందిరాలు యువతకు మంచి విలువలు నేర్పుతూ మంచి మార్గంలో వెళ్లేలా కృషి చేస్తున్నాయని తెలిపారు. కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వివేకానందుడి ఆదర్శంగా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో నడుస్తూ మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నత విద్యను సంపాదించుకోవాలని సూచించారు. విద్యార్థులు చెడు మార్గంలో వెళ్లకుండా గంజాయి, సారా ఇలాంటి వ్యసనాలు యువతపై ఎక్కువ ప్రమాదంలో పడవేసే అవకాశం ఉంది కాబట్టి యువజన సంఘాల సంఘాల నాయకులకు ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులకు పలు సూచనలు చేశారు. యువత ఎక్కడ చెడు మార్గంలో పయనించిన వెంటనే వారిని మంచి మార్గంలో వెళ్లేటట్లు మార్చేలా యువత పాటుపడాలని, వివేకానందుని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. అనంతరం కోరుట్ల పట్టణంలోని జూనియర్, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు వివేకానందుని జయంతి సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు వాసవి క్లబ్ వారి ద్వారా బహుమతి ప్రధానం చేశారు. యువజన సంఘాల నాయకులకు, స్వచ్ఛంద సేవా సంస్థల నాయకులకు యువత విభాగం అన్ని పార్టీల అధ్యక్షులకు, సమాజంలో విశిష్ట సేవలు అందించిన వారికి పాఠశాల పక్షాన సత్కరించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన అతిధులందరికీ ప్రబంధకారిని, సమితి పక్షాన ఘనంగా సన్మానించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రధాన ఆచార్యులు గోఫు వెంకటేష్, ఆచార్య బృందానికి మాతాజీలకు, ప్రబంధకారిణి, సమితి సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శిశు మందిర్ అధ్యాపకులు, ప్రబంధ కారిని, సమితి సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, యువజన సంఘాల సభ్యులు, కోరుట్ల పట్టణ జూనియర్ కాలేజీ విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.