కేజీబీవీ విద్యార్థినిల భద్రత, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
డిఇఓ రమేష్ కుమార్.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 14):
నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట, బిజినపల్లి మండల కేంద్రాల్లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలను
నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రమేష్ కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు పెడుతున్న భోజనం, వంట సరుకులు, కూరగాయలు తనిఖీ చేసి శుచి, శుభ్రత తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు.
పాఠశాల పరిసరాలు, వంట గది, స్టోర్ రూమ్, తరగతి గదుల్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం డిఇఓ మాట్లాడుతూ పాఠశాల
పరిసరాలతో పాటు విద్యార్థులు నిద్రించే గదులు, టాయిలెట్లు, వంటశాలల్లో పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు.విద్యార్థులకు వడ్డించే ఆహారం కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని, శుద్ధి చేసిన నీటిని అందించాలని సూచించారు.పదో తరగతి విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించారు.ఇటీవలే ప్రభుత్వం నుండి వచ్చిన బ్లాంకెట్లను విద్యార్థులకు అందజేశారు. డిఇఓ వెంట కేజీబీవీల పర్యవేక్షణ అధికారిని శోభారాణి, బిజినపల్లి తాహసిల్దార్ రాములు, కేజీబీవీ ప్రత్యేక అధికారులు ఉన్నారు.