కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ప్రజా సమస్యలను పరిష్కరిద్దాం
—కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్
తెలంగాణ కెరటం బెజ్జంకి ప్రతినిధి జనవరి 21 :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ప్రజా సమస్యలను పరిష్కరిద్దామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం రోజున ఆయన బెజ్జంకి మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ తన్నీరు శరత్ రావు, పాలక వర్గం ఆధ్వర్యంలో 3 కోట్ల వ్యయంతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్, ఫంక్షన్ హాల్, సహకార సంఘ భవనాలను మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, డీసీఎమ్ఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ లతో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల 769 మంది తాజా మాజీ సర్పంచులు ఉన్నారని, వారందరికీ సుమారు 13 వందల కోట్ల రూపాయల బిల్లులు రావాలని అన్నారు. ఒక్కో సర్పంచికి సుమారు 5 లక్షల నుండి కోటి రూపాయల వరకు బకాయిలు ఉన్నాయని, గ్రామాల్లో పల్లె ప్రగతి, రైతు వేదిక, వైకుంఠ దామం, డంపింగ్ యార్డ్, కమ్యూనిటీ హాల్స్, సీసీ రోడ్లు, వంటి గ్రామ అభివృద్ధి పనులు మాజీ సర్పంచుల వల్లనే జరిగిందని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలనీ కోరారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలివైనోడు అని, గతంలో గన్నేరువరం నుండి బేగంపేట్ కు రోడ్డు నిర్మించాలని కోరారు. ప్రస్తుతం గన్నేరువరంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ఎన్నికలు ముగిసాక అభివృద్దే నా లక్ష్యం అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కార్పొరేట్ స్థాయికి దీటుగా ఫంక్షన్ హాల్, షాపింగ్ కాంప్లెక్స్ భవనాలను నిర్మించిన తన్నీరు శరత్ రావు కు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆప్కాబ్ చైర్మన్ దేవిశెట్టి శ్రీనివాసరావు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ లు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు, రైతులు, యువజన నాయకులు, సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.