ఉర్దూ జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి

ఖమ్మం జిల్లా కలెక్టర్ కు వినతి

ఖమ్మం, డిసెంబర్ 3 (తెలంగాణ కెరటం) : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వివిధ ఉర్దూ పత్రికలలో పనిచేస్తున్న ఉర్దూ జర్నలిస్టులకు తెలుగు జర్నలిస్టులతో పాటు తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ శుక్రవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ కు ఉర్దూ జర్నలిస్టుల ఫోరం వినతి పత్రాన్ని సమర్పించింది. ఫోరం నాయకుడు హాఫిజ్ మొహమ్మద్ జవ్వాద్ అహ్మద్ అందజేసిన వినతిపత్రం లో…. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఉన్నతాధికారులు ఉర్దూ జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో రెండవ అధికార భాషగా ఉర్దూ కొనసాగుతున్నప్పటికీ ఉర్దూ జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్య , నిర్లిప్త వైఖరి ఖండనియమని , ఈ విషయంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఉన్నతాధికారులకు ప్రాధాన్యత అంశంలో తగిన సూచనలు చేయాలని కోరారు. అదేవిధంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో ఉర్దూ జర్నలిస్టులకు కూడా సమంజసమైన రీతిలో ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్రిడేషన్ కమిటీలలో ఉర్దూ జర్నలిస్టులకు స్థానం కల్పిస్తుండగా ఖమ్మం జిల్లాలో మాత్రం చోటు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ జీవోకు వ్యతిరేకమని , ఇప్పటికైనా జిల్లాలో ఉర్దూ జర్నలిస్టులకు అక్రిడేషన్ కమిటీలలో చోటు కల్పించాలని విన్నవించారు. వినతి పత్రం సమర్పించిన బృందంలో జర్నలిస్టులు ఇంతియాజ్ , జానీ , చక్రవర్తి , అబ్దుల్ అహత్ లు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment