సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మెకు రాష్ట్రాపాధ్యాయ సంఘం, తెలంగాణ రాష్ట్రం, సంపూర్ణ మద్దతు,
సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి,
రాష్ట్ర అధ్యక్షులు యం. పర్వత్ రెడ్డి.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 10):
పాఠశాల విద్యాశాఖలో భాగంగా తెలంగాణ సమగ్ర శిక్షలో పని చేస్తున్న బోధన, బోధనేతర ఉద్యోగులు అందరిని రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర న్యాయమైన డిమాండ్ల సాధనకోసం వారు జిల్లా కేంద్రాల్లో ఈ నెల 6వ తేది నుండి నిర్వహిస్తున్న రిలే నిరసన దీక్షలు అనంతరం నేటి మంగళవారం నుండి చేపడుతున్న నిరవధిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ రాష్ట్రాపాధ్యాయ సంఘం, తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర అధ్యక్షులు యం. పర్వత్ రెడ్డి తెలిపారు.మంగళవారం ఆయన నాగర్ కర్నూలు జిల్లాలోని సమగ్ర శిక్ష జిల్లా నాయకులతో మాట్లాడారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పర్వత రెడ్డి మాట్లాడుతూసమగ్ర శిక్ష అభియాన్లో ఉద్యోగులకు కనీస వేతన చట్టం అమలు కావడం లేదని, వెట్టిచాకిరి విధానం అమలవుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విభాగంలో సుమారుగా 20 వేల మంది ఉద్యోగులు ఏళ్ళ తరబడి పనిచేస్తున్నారని, అయినప్పటికీ పనికి తగిన వేతనం లభించడం లేదని అన్నారు. వారికి ఉద్యోగ భద్రత లేకపోవడంతో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు.సర్వ శిక్ష అభియాన్ లో పని చేస్తున్న మహిళ ఉపాధ్యాయులకు రెగ్యులర్ ఉద్యోగుల్లాగా 180 రోజుల ప్రసూతి సెలవులు ఇతర అన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగుల సర్వీసును వెంటనే రెగ్యులరైజ్ చేస్తూ, సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని పర్వత్ రెడ్డి డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ఎదురుగా ఏర్పాటుచేసిన నిరవధిక సమ్మె దీక్ష శిబిరంలో పలువురు జిల్లా నాయకులు మాట్లాడుతూ…ఇచ్చిన హామీలను గాలి కొదిలేసి సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారంటూ సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు రోడ్డెక్కారు. సమాన పనికి సమానవేతనం అమలు చేయాలంటూ పట్టుబట్టారు. ఉద్యోగ భద్రత, గ్రాట్యూటీ తదితర డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె కొనసాగుతుందని సమగ్ర శిక్ష ఉద్యోగులు తేల్చిచెప్పారు.