- సేవాలాల్ మహారాజ్ క్రికెట్ టోర్నీప్రారంభించిన డీఎస్పీ చంద్రభాను నాయక్
ఖమ్మం అర్బన్, జనవరి 05 (తెలంగాణ కెరటం): సేవాలాల్ మహారాజ్ పేరుతో క్రికెట్ టోర్నమెంట్ ను సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించారు. ఈ సేవాలాల్ మహారాజ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ఇల్లందు డిఎస్పి చంద్రభాను నాయక్ విచ్చేసి టోర్నమెంట్ నిర్వాహకులు బాలాజీ, కార్యదర్శి రవి నాయక్, డాక్టర్ భవసింగ్ లతో కలిసి సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. అంతకుముందు జడ్పీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీగా బంజారా సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలతో ప్రదర్శనగా బయలుదేరి సర్దార్ పటేల్ స్టేడియం వద్దకు చేరుకున్నారు. స్టేడియం ముందు బంజారా ఆటపాటలతో ధూంధాం నిర్వహించారు . ఈ క్రికెట్ పోటీలకు మొదటి బహుమతి డాక్టర్ విజయ చౌహన్, డాక్టర్ సుష్మ లత రూ.50వేలు, రెండో బహుమతి డాక్టర్ వెంకన్న రూ.30 వేలు, మూడో బహుమతి పదివేల రూపాయలను గాంధీ నాయక్ ఆర్ ఎస్ ఐ ప్రకటించారు. ఈ సందర్భంగా అతిధులు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ పేరుతో వరుసగా రెండో సంవత్సరం ట్రోఫీని నిర్వహిస్తూ బంజారా యువకులను ప్రోత్సహిస్తున్న అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులను అభినందించారు. భవిష్యత్తు కాలంలో కూడా ఇదే విధమైన స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఉండాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరికుమార్, డాక్టర్ దేవేందర్, దేవేందర్ శ్యాం కుమార్, డాక్టర్ ప్రేమ్ కుమార్, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ లక్ష్మణ్ సింగ్, డాక్టర్ రవికుమార్, డాక్టర్ విశ్వనాథ్, డాక్టర్ అరుణ్, డాక్టర్ రంగారావు, డాక్టర్ రవీందర్, డాక్టర్ చందు, డాక్టర్ కృష్ణ, డాక్టర్ మోహన్ , డాక్టర్ చంద్రబోస్, గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.