జై జవాన్.., జై కిసాన్ కు ప్రతీక
- జన్మభూమి.. నేలతల్లి రూణం తీర్చుకోవాలనే తపన
- ‘పల్లె సృజన’కు అంకురార్పణ
- తెలుగుతనం.. నిలువెత్తు తేజస్సు
- ఖమ్మంకు బ్రిగేడియర్ (రిటైర్డ్) పి.గణేశం రాక
- ‘విద్యాక్షేత్ర’లో అమూల్యమైన ప్రసంగం
ఖమ్మం కల్చరల్, మార్చి06 (తెలంగాణ కెరటం): భారత రాజకీయాలలో అత్యంత బలహీనుడిగా కనిపించే మన దివంగత ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి ఎంతటి ఉక్కుమనిషో మరెంత దేశభక్తి గలవాడో అందరికి తెలిసిన విషయమే. ఆయన జై జవాన్.. జై కిసాన్ నినాద సృష్టికర్త కూడా.., జన్మభూమి రక్షణ కోసం సైనికులు ఆ భూమిలో నివసించే ప్రజల ఆకలి తీర్చే కర్షకులు కూడా సమాజానికి ఆదర్శవంతులే అన్న భావనతో ఆ నాడు శాస్త్రి జై జవాన్.. జై కిసాన్ అన్నారు. ఆయన అన్న ఆ నినాదాలను నిజ జీవితంలో ఆచరణలో పెట్టిన వారు అరుదు. ఆ అరుదైన వ్యక్తులలో మొదటి వరుసలో నిలబడే వ్యక్తి మన తెలుగువాడు బ్రిగెడియర్ (రిటైర్డ్) పి.గణేశం. జన్మభూమి రక్షణకోసం సిద్ధిపేట నుంచి సైన్యంలో చేరి 35 సంవత్సరాల పాటు దేశ సేవలో తరించి, జన్మభూమి కోసం చేసిన సేవలనంతరం ఒక సైనికుడు విశ్రమించకూడడనే ఉద్దేశంతో నేల తల్లికి కూడా తన రుణాన్ని తీర్చుకోవడానికి ఆయన సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే 1995వ దశకంలో ‘పల్లె సృజన’ అనే స్వచ్చంద సంస్థను స్థాపించారు. తద్వార గ్రామీణ ప్రాతాలలో వ్యవసాయం చేసుకునే కర్షకుల సమస్యలు – పరిష్కారాలు అంశంపై అవగాహన కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో చేపట్టారు. కేవలం ఉపన్యాసాలకు తన అవగాహన కార్యక్రమాలను పరిమితం చేయకుండా వాటిని ఆచరణ ద్వారా అనేకమంది కర్షకులకు ఆయన ఒక దిక్సుచిగా మారారు. ఆయన ద్వారా స్ఫూర్తి పొందిన అనేకమంది అనేక అవార్డులను కూడా సాధించడం విశేషం. పూర్తి తెలుగుదనం నిండిన తేజస్సుతో అలరాడే మన పి.గణేశం తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట జిల్లా భూపల్లి గ్రామానికి చెందిన వారు. ఈ నెల 8వ తేదీన ఖమ్మం నగరంలోని ‘విద్యాక్షేత్ర’ ఉన్నత పాఠశాల మొదటి వార్సికోత్సవ కార్యక్రమం పలు సంస్కృతిక కార్యక్రమాల నడుమ జరగనుంది. ఈ సందర్భంగా బ్రిగెడియర్ (రిటైర్డ్) పి.గణేశం ఖమ్మం నగరానికి విచ్చేయనున్నారు. ఇదే సందర్భంగా ‘విద్యాక్షేత్ర’లో తన అమూల్యమైన ప్రసంగాన్ని ఇవ్వనున్నారు.
తాను వంద జన్మలెత్తినా ఆర్మీలోనే చేరుతానని, ఆర్మీలో మొదట ప్రాధాన్యతనిచ్చే అంశం దేశ గౌరవం, దేశ రక్షణ. కాబట్టి తాను వంద జన్మలెత్తినా ఆర్మీలో చేరుతానని.. అందుకే. జన్మభూమి రుణం నిమిత్తం అందరూ ఆర్మీలో చేరకపోయినా దేశ గౌవరం, దేశ రక్షణ అనే విషయాన్ని తమ ప్రాధమిక కర్తవ్యంగా భావించాలని ఆయన జీవితం ఇచ్చే స్ఫూర్తి. సైనికుల వలే కర్షకులు కూడా దేశ సేవలో నిమగ్నమైన వారే అనేది ఆయన మనసా.. వాచా.. కర్మేణా నమ్మిన బాట.
(ధర్మసోత్ రామకృష్ణ జర్నలిస్ట్)