తెలంగాణ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ డేట్ ఇదేనా?
తెలంగాణ మరో ఎన్నికలకు సిద్ధమవుతోంది. పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. వచ్చే ఏడాది జనవరి 14వ తేదీన పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని తెలిసింది. మొత్తం 3 దఫాలుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి నెలతోనే తెలంగాణ సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసింది. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ఇంఛార్జీల పాలన నడస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగబోతున్న తొలి సర్పంచ్ ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. దీంతో ఈ ఎన్నికలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.
పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామని పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల జాబితాల ఆధారంగా వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలను రూపొందించింది.