దేశ రక్షణకు బజరంగ్ దళ్ కార్యకర్తలను తయారు చేయడమే లక్ష్యం
త్రిశూల్ దీక్ష ప్రతిజ్ఞ చేపట్టిన బజరంగ్ దళ్ కార్యకర్తలు
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, జనవరి
యువతలో జాతీయ భావాలు నింపి భారత దేశ రక్షణకు ప్రతి కుటుంబంలో బజరంగ్ దళ్ కార్యకర్తలను తయారు చేయడమే లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర సామాజిక సమరసత ప్రముఖ్ లింగం పేట ధనుంజయ్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పిబి గార్డెన్స్ లో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఆదివారం త్రిశూల్ దీక్ష కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సుమారు 600 మంది బజరంగ్ దళ్ కార్యకర్తలు త్రిశూల్ దీక్ష ప్రతిజ్ఞ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాన వక్త లింగంపేట ధనుంజయ్ మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని రక్షించడం ప్రతి ఒక్క ఒక్కరి బాధ్యత అని అన్నారు. యువతను దేశభక్తులుగా తయారు చేయడమే కాకుండా భారతదేశ రక్షణ కొరకు జాతీయ భావాలు నింపి ప్రతి కుటుంబంలో బజరంగ్ దళ్ కార్యకర్తను తయారు చేయడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమానికి హాజరైన ఆత్మీయ అతిథులు తెలంగాణ విశ్వహిందూ పరిషత్ ప్రాంత ఉపాధ్యక్షులు డా.రాంసింగ్, తెలంగాణ బజరంగ్ దళ్ ప్రాంత సంయోజక్ శివరాములు, విశ్వహిందూ పరిషత్ కరీంనగర్ విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్ లు మాట్లాడుతూ ప్రలోభాల ద్వారా ఇతర మతంలోకి వెళ్లిన వారిని తిరిగి ఘర్ వాపసి ద్వారా స్వధర్మం హిందూ మతంలోకి తీసుకురావడమే ముఖ్య ఉద్దేశమని అన్నారు. లవ్ జిహాద్ బారి నుండి హిందూ యువతులను రక్షించడం, గో రక్షణ చేయడం, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని సన్మార్గంలో నడిచేలా చేయడం సేవా, సురక్ష, సంస్థాన్ అనే మూడు నినాదాల ద్వారా బజరంగ్ దళ్ కార్యకర్తలు లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం త్రిశూల్ దీక్ష ద్వారా జరిగిందని తెలిపారు. ప్రభుత్వాధినంలో ఉన్న ఎండోమెంట్ యాక్ట్ రద్దు చేయాలని, దేవాలయాల స్వయం ప్రతిపత్తిని హిందువులకు అప్పచెప్పాలని ప్రభుత్వాన్ని కోరారు. హిందు దేవాలయాలలో పని చేస్తున్న అన్యమతస్తులకు ఎటువంటి స్థానం లేదని అన్నారు. బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు త్రిశూల్ దీక్ష కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం బజరంగ్ దళ్ కార్యకర్తలు పట్టణ పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. హనుమాన్ ధ్వజాలు చేతబట్టి జై శ్రీరామ్ నినాదాలతో పద సంచలనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్లె మధు, జిల్లా అధ్యక్షుడు పద్మాకర్, జిల్లా కార్యదర్శి గజం రాజు, జిల్లా ఉపాధ్యక్షులు పోహార్ తుకారం, జిల్లా బజరంగ్ దళ్ కన్వీనర్ రోహిత్, కో కన్వీనర్ మనోహర్, చెట్పల్లి శంకర్, కోయల్కర్ శివ, గొడికె విజయ్, వెంకటేష్, జయ ప్రకాష్, వివిధ హిందూ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.