నారాయణఖేడ్ చప్టాలో విషాదం
తెలంగాణ కెరటం:నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి జనవరి 10
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చప్టా గ్రామానికి చెందిన ఉమాకాంత్ (34) ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందిన ఘటన స్థానికులను విషాదంలో ముంచింది. మతిస్థిమితం లేని ఉమాకాంత్ గత నెల 24న హైదరాబాద్ ఎర్రగడ్డ ఆసుపత్రి నుండి చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు.ఇంటికి వచ్చిన తరువాత మళ్లీ మొన్న ఇంటి నుండి వెళ్లి కనిపించకుండా పోయిన ఉమాకాంత్, ఈ రోజు ఉదయం చప్టా పంచాయతీ పరిధిలోని సీతారాం తాండా శివారులో బావిలో శవమై కనిపించారు.ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పూర్తి వివరాల కోసం దర్యాప్తు జరుగుతోంది.