జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను త్వరగా పరిష్కరిస్తాం
- అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి
- భూ బదలాయింపునకు మార్గాలను అన్వేషిస్తున్నాం
- స్తంభాద్రి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ భూ కేటాయింపు అంశం మా దృష్టిలో ఉంది
- రాష్ట్రవ్యాప్త జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పాలసీ రూపొందించే పనిలో ఉన్నాం
ఖమ్మం, ఫిబ్రవరి 3(తెలంగాణ కెరటం): మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు ఖమ్మం జిల్లాలోని మూడు ప్రధాన జర్నలిస్టు సంఘాలు, స్తంభాద్రి హౌసింగ్ సొసైటీ ప్రతినిధుల బృందం అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ) శ్రీనివాసరెడ్డిని సోమవారం ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసింది. ఖమ్మం నియోజకవర్గ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు మీద సుదీర్ఘంగా చర్చించింది. ప్రభుత్వ జీవోలు, సొసైటీ ఏర్పాటు, సుప్రీంకోర్టు తీర్పు వంటి అంశాలను ఈ సమావేశంలో జర్నలిస్టు బృందం ప్రతినిధులు అడిషనల్ కలెక్టర్ కు సవివరంగా తెలియజేశారు. రాష్ట్రవ్యాప్త జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని అభినందిస్తూనే, త్వరితగతిన, మొదటి ప్రాధాన్యతలో ఖమ్మం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని యూనియన్లు, సొసైటీ ప్రతినిదుల బృందం అడిషనల్ కలెక్టర్ ను కోరింది. రాష్ట్ర వ్యాప్త పాలసీతో పాటు, ఖమ్మంలోని స్తంభాద్రి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అంశంను కూడా న్యాయ నిపుణులతో సంప్రదించి ఒక నిర్ణయం తీసుకుంటామని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మూడు యూనియన్లు, హౌసింగ్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. స్తంభాద్రి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ భూ కేటాయింపులకు, సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధం లేదన్న జర్నలిస్టు ప్రతినిధుల బృందం వాదనను కూడా పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తామని అడిషనల్ కలెక్టర్ తెలిపారు. స్తంభాద్రి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి భూమి బదలాయింపు జరిపే దశలో ప్రక్రియ నిలిచి ఉన్నదని, వెంటనే జిల్లా అధికారులు, ప్రభుత్వ పెద్దలతో చర్చించి సత్వరం పరిష్కరిస్తామని తెలిపారు. న్యాయ నిపుణుల సలహా, ప్రభుత్వ అనుమతితో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశాన్ని త్వరితగతన పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు పల్లా కొండలరావు, టియుడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి, స్తంభాద్రి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు కనకం సైదులు, కోశాధికారి వెన్నబోయిన సాంబశివరావు, ఫెడరేషన్ నాయకులు రాము పాల్గొన్నారు.