సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
–ఇంటింటి ప్రచారం చేస్తున్న సీపీఎం నాయకులు
దుబ్బాక:డిసెంబర్21,(తెలంగాణ కెరటం )
సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ మహాసభల జయప్రదం కొరకు విరాళాలు సేకరించడం జరుగుతుంది.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.భాస్కర్ మాట్లాడుతూ, సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు జనవరి 25 నుండి 28 వరకు సంగారెడ్డి పట్టణంలో నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ మహాసభలలో గత మూడు సంవత్సరాల కాలంలో జరిగిన కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తు పోరాటాల కొరకు కార్యాచరణను రూపొందించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటివరకు ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన నిరంతరం సమరశీల పోరాటాలు నిర్వహించడం జరిగిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు.అనేక రకాల సమస్యలను గుర్తిస్తూ ప్రజాసంక్షేమం కోసం పనిచేసే విధంగా ప్రభుత్వాలపై ,అధికారుల పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా సిపిఎం పార్టీ పనిచేస్తుందని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో అత్యధికంగా ఉన్న బీడీ కార్మికుల సమస్యలతో పాటు అన్ని వర్గాల కార్మికుల సమస్యలపై కార్యక్రమాలు నిర్వహిస్తూ సమస్యల పరిష్కారాల కోసం పోరాడుతుందని గుర్తు చేశారు.ఈ మహాసభల జయప్రదం కోసం ఈ ప్రాంతంలోని ప్రజలు,శ్రేయోభిలాషులు సహాయ సహకారాలు అందించి మహాసభల జయప్రదం కోసం తోడ్పాటు అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి కొంపల్లి భాస్కర్ నాయకులు బత్తుల రాజు, మెరుగు రాజు, ఎండి సాజిద్ ,ప్రశాంత్ ,మహేష్, లక్ష్మీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.