అంతా అధికారులకు తెలుసు అంటున్నా రైస్ మిల్ యజమానులు?
గ్రామాల్లో బియ్యం సేకరిస్తున్న ముఠాలు
బిబిపేట్ మండలంలోని పలు గ్రామాల్లో యథేచ్ఛగా
బిబిపేట్ మండలంలోని పలు గ్రామాల్లో యథేచ్ఛగా రేషన్ బియ్యం దందా కొనసాగుతోంది. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పంపిణీ అవుతున్న రేషన్ బియ్యాన్ని కొంతమంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి గ్రామాల్లో యథేచ్ఛగా కొనుగోలు చేస్తున్నారు. వాడవాడలా తిరుగుతూ 13 రూపాయల నుంచి 15 రూపాయలు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలపై, ట్రాలీ ఆటోలలో అనుమానం రాకుండా కొనుగోలు చేస్తున్నారు. తిరిగి అవే బియ్యాన్ని రాత్రిపూట మండల పరిధిలోని పలు రైసు మిల్లులకు తరలిస్తున్నారు. దీంతో రైస్ మిల్లర్ల పంట పండుతుంది. కొంతమంది రైస్ మిల్లర్లు పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ కోట్లాది రూపాయలను సంపాదించినట్లు గ్రామాల్లో బాహాటంగానే చర్చించుకుంటున్నారు. బియ్యం దందా చేస్తూ పట్టుబడినప్పుడు సివిల్ సప్లై అధికారులకు, పోలీసులకు ఎంతో కొంత మామూళ్లు ముట్టచెబుతూ వారి దందాను కొనసాగిస్తున్నారు. పేదలకు అందాల్సిన బియ్యం తిరిగి రైస్ మిల్లులకు చేరడంతో ప్రజల సంక్షేమం దేవుడు ఎరుగు కానీ రైస్ మిల్లర్లు మాత్రం అంచలంచెలుగా ఆర్థికంగా ఎదుగుతున్నారు.
బిబిపేట్ కు వచ్చే బియ్యం ఎక్కడివి?
పెద్ద చేపలను వదిలేసి చిన్న చితకగా కొనుగోలు చేసే వారిని మాత్రమే పోలీసులు పట్టుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. కానీ వాస్తవంగా పలు మిల్లులో రేషన్ బియ్యం దందా పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు సమాచారం. కొన్నిసార్లు సివిల్ సప్లై అధికారుల చేసిన దాడుల ద్వారా బహిర్గతమైంది.గతంలో ఓ రైస్ మిల్లులో నేరుగా పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్నారనే సమాచారం రైస్ మిల్ యజమానిపై సివిల్ సప్లై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం? బుద్ధి మార్చుకోక అదే దందా కొనసాగిస్తున్నారు. అడపా దడపా రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వారిని మాత్రమే పట్టుకుంటున్న పోలీసులు అసలు బియ్యం ఎక్కడికి వెళ్తున్నాయి అనే కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు. ప్రత్యేక నిఘా పెట్టి రేషన్ బియ్యం సేకరిస్తున్న, కొనుగోలు చేస్తున్న మిల్లర్లను కట్టడి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.