పండుగ సంబరాల్లోనూ జాగ్రత్తలు అవసరం
–దుబ్బాక ఎస్సై గంగరాజు
దుబ్బాక:జనవరి13,(తెలంగాణ కెరటం)
సంక్రాంతి సంబరాల సమయంలో కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని దుబ్బాక ఎస్సై వి. గంగరాజు అన్నారు.సంక్రాంతి పర్వదిన సందర్భంగా పురస్కరించుకొని సోమవారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటలో మండల పరిషత్ మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఎండి రఫీ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 50 మందికి పైగా మహిళలు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. కేవలం చుక్కల ముగ్గులు మాత్రమే వేయాలన్న నిబంధన ప్రకారం లచ్చపేట అంగడి బజార్ ప్రాంతంలో ఈ పోటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దుబ్బాక ఎస్సై వి. గంగరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని, విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలకు ముగ్గులు వేసే ఆసక్తి ఎక్కువగా ఉంటుందని అన్నారు. ముగ్గులు వేసే మహిళలు తమ చిన్నారులకు కూడా ముగ్గులు వేయడం నేర్పించి వారిలోనే కళాత్మకతను కూడా గుర్తించాలన్నారు.అంతేకాకుండా పండుగ వేడుకలను ఉత్సాహంగా జరుపుకునే సందర్భంలో ఏ రకమైన ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పండుగలకు వచ్చే సెలవుల్లో యువకులు, చిన్నారులు సరదా కోసం పతంగులు ఎగరవేయడం, ఈత కోసం పరిసరాల్లోనే చెరువులు, జలాశయాలకు వెళ్లడం చేస్తుంటారన్నారు. ఈత కొట్టే సందర్భాల్లోనూ, పతంగులు ఎగరవేసేందుకు ప్రమాదకర మాంజాలు వాడటం, రక్షణ లేని (పిట్ట గోడలు లేని) భవనాలు ఎక్కి కరెంట్ తీగలను తాకడం, భవనాలపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడటం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. పతంగులు ఎగరవేసుకుంటూ రోడ్లపై చూసుకోకుండా రోడ్డు ప్రమాదాలకు గురవడం వంటి సంఘటనలు రోజు జరుగుతున్నాయన్నారు. ఈ పరిస్థితులను గుర్తించి ప్రతి కుటుంబం తమ పండుగ సరదాకు సంబంధించిన పనులు చేసుకుంటూనే జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ గంగరాజు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యురాలు ఇంగు శోభ, మదన్ మోహన్, ప్రొబేషనరీ ఎస్సై కీర్తి రాజు, లెక్చరర్ సంతోష, మహిళా వ్యాపారి జ్యోతి, పూస సత్యం, అన్వర్, యువకులు బత్తిని సతీష్, శివ, దీపక్, వసీం, వహీద్, మోసిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతలైన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు రెండు కన్సోలేషన్ ప్రైజులు అందించారు. అదేవిధంగా ముగ్గుల పోటీలో పాల్గొన్న వారితో పాటు సహాయకులుగా ఉన్నవారందరికీ కూడా బహుమతులను అందజేశారు.