గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తే కఠిన చర్యలు
దుబ్బాక సీఐ పాలెపు శ్రీనివాస్
దుబ్బాక:డిసెంబర్26,(తెలంగాణ కెరటం )
నేటి సమాజంలో గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు యువత బానిసలై, వారి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారని, మాదకద్రవ్యాలను ఎవరైనా విక్రయించినా, రవాణా చేసిన కఠిన చర్యలు తప్పవని దుబ్బాక సీఐ పాలెపు శ్రీనివాస్ హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ అనురాధ ఆదేశాల మేరకు గురువారం దుబ్బాక పట్టణంతో పాటు హబ్సిపూర్ గ్రామంలోని పలు పాన్ షాప్లు, కిరాణా దుకాణాల్లో మాదకద్రవ్యాల నివారనే లక్ష్యంగా డాగ్ స్క్వాడ్ సిబ్బందితో కలిసి ఆయన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏవైనా దుకాణాలలో గాని, పాన్ షాపుల్లో గాని డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే, పోలీసులకు సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రస్తుత సమాజంలో గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలను తరిమి కొట్టాల్సిన సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సమాజంలో నేటి యువత చెడు అలవాట్లకు బానిసలు కాకుండా, క్రమశిక్షణతో ఉన్నత చదువులు చదివి, తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ఉన్నత రంగాల్లో స్థిరపడాలని కోరారు. ఆయన వెంట దుబ్బాక పోలీస్ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ సిబ్బంది తదితరులు ఉన్నారు.